సీయూఈటీ ఆధారంగా ప్రవేశాలు కల్పించండి
ఈ మేరకు యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ అన్ని వర్సిటీల వైస్ చాన్సలర్‌లు, డైరెక్టర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు లేఖ రాశారు. 2022–23 విద్యాసంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు సీయూఈటీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సీయూఈటీ ద్వారా కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నారు. కాగా 2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీలో 45 సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చి చేరాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) నిర్వహించే సీయూఈటీ రాసేందుకు ఏప్రిల్ 2 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు, వర్సిటీలు ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తే దేశవ్యాప్తంగా విద్యార్థులు బహుళ ప్రవేశ పరీక్షలు రాయాల్సిన ఇబ్బందులు తప్పుతాయి. విద్యార్థులు ప్రతి పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లింపు, ఇతర వ్యయప్రయాసలు, కోచింగ్ తిప్పలు, పరీక్షలకు హాజరవడంలో ప్రయాణ ఇబ్బందులు ఉండవు.
విద్యార్థులకు సమాన అవకాశాలు..
వివిధ ఇంటర్ బోర్డుల నుంచి హాజరయ్యే విద్యార్థులందరికీ సీయూఈటీ ద్వారా సమాన అవకాశాలను అందించడానికి వీలవుతుందని యూజీసీ అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు 2022–23 నుంచి సీయూఈటీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. కాగా సీయూఈటీని ఎన్ టీఏ జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. మార్గదర్శకాలను ఎన్ టీఏ మార్చి 27న తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.