Engineering Seats 2024 : ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచాలని ప్రభుత్వంపై ఇంజనీరింగ్ కాలేజీల ఒత్తిడి
హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు తగ్గించైనా, సీఎస్‌ఈ సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన కొన్ని యాజమాన్యాలు.. అధికారులు ఉద్దేశపూర్వకంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు ఏటా డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 125 కాలేజీలు సీట్ల పెంపు ప్రతిపాదన తెచ్చాయి.
Also Read: EAMCET / EAPCET Top Colleges & Cut-off RANKS
సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే..
కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా.. కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు.
మరోవైపు బోధన ప్రణాళికను మారుస్తున్నారని, కోర్ గ్రూపులో జాయిన్ అయినా, సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
గత ఏడాది తగ్గిన చేరికలు
గత ఏడాది 58 శాతం విద్యార్థులు సీఎస్‌సీ, అనుబంధ కోర్సుల్లోనే చేరారు. సివిల్, మెకానికల్ ఈఈఈ కోర్సుల్లో 12,751 సీట్లు ఉంటే, కేవలం 5,838 మంది మాత్రమే (45.78 శాతం) చేరారు. ఈఈఈలో 5,051 సీట్లు ఉంటే 2,777 సీట్లు, సివిల్‌లో 4,043 సీట్లు ఉంటే 1,761 సీట్లు, మెకానికల్‌లో 3,657 సీట్లు ఉంటే, 1,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.
ఆయా కోర్సులను మరింత బలహీనపరిచే ప్రైవేటు కాలేజీల ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. కాగా ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తిని అంగీకరిస్తే ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో దాదాపు 21 వేల సీట్లు పెరిగే వీలుంది. అదే సమయంలో కోర్ గ్రూపుల్లో దాదాపు 5 వేల సీట్లు తగ్గే అవకాశం కన్పిస్తోందని అంటున్నారు.
రీయింబర్స్‌మెంట్ వద్దు..
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచీలకు కలిపి గత ఏడాది లెక్కల ప్రకారం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 82 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతావి మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలావరకూ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపునకు కొన్నేళ్ళుగా ప్రభుత్వం పెద్దగా అనుమతించడం లేదు.
అయితే డిమాండ్ లేని కోర్సుల్లో తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సంబంధిత యూనివర్సిటీలు కూడా ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బడ్జెట్ పెరగడంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌కు మరో నాలుగేళ్ళ పాటు సరైన బోధనా సిబ్బంది దొరకడం కష్టమని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే నాన్ రీయింబర్స్‌మెంట్ సీట్ల పెంపు చేపట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి. అంటే పెరిగిన సీట్లకు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన మేరకు విద్యార్థే ఫీజు చెల్లించాలన్న మాట. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేయదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఈ తరహాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
Tags
- TS EAPCET 2024
- Engineering Admissions
- EAMCET Counselling
- TSCHE
- Sakshi Education News
- Education News
- engineering admissions and web option process
- Computer Science Engineering
- engineering seats increase
- university clarification
- technical education council
- higher education policy
- technical education
- Engineering Admissions
- college seat allocation
- SakshiEducationUpdates