పకడ్బందీగా ఎంసెట్ నిర్వహణ : గంటా
Sakshi Education
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 29వ తేదీన జరిగే ఎంసెట్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు.
లోపాలు తలెత్తకుండా ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు తగినన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావుకు సూచించారు. ఉదయం పది గంటలకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటలకు మెడికల్ పరీక్షకు విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని, నిమిషం ఆలస్యమైనా పలికి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి సందేహాలుంటే 0884 2340535, 0884 2356255 నంబర్లు, టోల్‌ఫ్రీ నంబరు 1800 425 6755 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. apeamcet2k16@gmail.comవెబ్‌సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,92,447 మంది ఎంసెట్‌కు హాజరుకానున్నారని, వీరిలో ఇంజనీరింగ్ 1,89,236 మంది, మెడికల్ 1,03,211 మంది ఉన్నారని మంత్రి గంటా తెలిపారు. తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Published date : 27 Apr 2016 04:07PM