Skip to main content

నేడు ఎంసెట్-3 షెడ్యూల్!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
ఎంసెట్-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడగానే అందుకు అనుగుణంగా తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. రీఎగ్జామ్‌కు కోర్టు ఓకే చెబితే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు పూర్తి చేసింది. పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించి, వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించి అదే నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఎంసెట్-2 పరీక్ష ప్రక్రియను 44 రోజుల్లో పూర్తి చేశారు. ఎంసెట్-3 నిర్వహణకు 45 రోజులు పట్టే అవకాశం ఉంది. లీక్ నేపథ్యంలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రశ్నపత్రాల తయారీ, వాటి ముద్రణ అంశాల్లో పక్కాగా వ్యవహరించాలంటూ అధికారులను ఆదేశాలు జారీ చేయనుంది. ఎంసెట్-3 నిర్వహణ బాధ్యతలను మళ్లీ జేఎన్టీయూహెచ్‌కే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రస్తుత కన్వీనర్ రమణారావుకు కాకుండా జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రె డ్డి లేదా రిజిస్ట్రార్ యాదయ్యకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పీజీఈసెట్ కన్వీనర్‌గా వేణుగోపాల్‌రెడ్డి వ్యవహరించగా.. ఈసెట్ కన్వీనర్‌గా యాదయ్య పని చేశారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఎంసెట్-3 కన్వీనర్ బాధ్యతలు అప్పగించే వీలుంది. జూలై 9న జరిగిన ఎంసెట్-2 పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 50,964 మంది పరీక్షకు హాజరు కాగా 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరికి పాత రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే కొత్త హాల్ టికెట్లను జారీ చేసి ఎంసెట్-3 నిర్వహించనునున్నారు. వీటన్నింటిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Published date : 01 Aug 2016 03:27PM

Photo Stories