ముగిసిన ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. తొలి, మలి విడతల్లో రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో 76,928 మందికి కన్వీనర్ కోటా కింద సీట్లు కేటాయించారు.
మలివిడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మీ ప్రకటించారు. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, 304 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, 14 యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసింది. ఎంసెట్-2015లో 1,28,580 మంది అర్హత సాధించారు. మొత్తం కన్వీనర్ కోటా సీట్లు 1,12,525 కాగా అందులో తొలివిడత కౌన్సెలింగ్‌లో 73,817 మందికి సీట్లు కేటాయించారు. ఇక మలివిడత కౌన్సెలింగ్‌లో 38,220 మంది 7,44,825 వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కన్వీనర్ కోటా కింద రెండో విడతలో అదనంగా 162 సీట్లను కేటాయించారు. దీంతో మొత్తం కన్వీనర్ కోటా సీట్ల సంఖ్య 1,12,687కు పెరిగింది. తొలి విడత అనంతరం 38,870 సీట్లను మలివిడత కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉంచారు. మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలో 12,511 మంది కొత్త అభ్యర్థులు కాగా 28,761 మంది తొలివిడతలో సీట్లు వచ్చి మార్పు కోరుకున్నవారు ఉన్నారు. రెండు విడతల కౌన్సెలింగ్‌లో 76,928 మంది సీట్లు పొందగా 36,324 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో 32,836 ఇంజనీరింగ్, 3,488 ఫార్మసీ సీట్లు ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ విధానంలో లేదా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ ఉదయలక్ష్మీ సూచించారు. ఈ నెల 25వ తేదీలోగా అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను కాలేజీల్లో సమర్పించాలని పేర్కొన్నారు.
Published date : 17 Jul 2015 02:23PM