మే 9న ఏపీ ఎంసెట్ ఫలితాలు: గంటా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను మే 9న విడుదల చేయనున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఏప్రిల్ 29న జరగనున్న ఎంసెట్-2016 నిర్వహణపై శనివారం ఆయన విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలో నిర్వహించే ఈ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. మే 27న అడ్మిషన్ల నోటిఫికేషన్, జూన్ 6న ధ్రువపత్రాల పరిశీలన, జూన్ 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 22న సీట్ల కేటాయింపు ఉంటుందని మంత్రి వివరించారు. జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, 2.30 నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష ఉంటుంద ని తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోరని స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్ విభాగంలో 1,87,529 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 1,02,254 మంది.. మొత్తం 2,89,783 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరీక్షలకు ఏపీలో 22, హైదరాబాద్‌లో 2 రీజనల్ కేంద్రాలను కేటాయించారన్నారు. గ తేడాదికన్నా 34,370 దరఖాస్తులు అదనంగా వచ్చాయన్నారు. వికలాంగ అభ్యర్థుల కోసం సహాయకులను కేటాయించడంతోపాటు అదనపు సమయాన్ని ఇవ్వనున్నారన్నారు. ఉర్దూ విద్యార్థులకు కర్నూలు జిల్లా కేంద్రంగా అనువాదకులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి హాల్‌టికెట్, పెన్నులు, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, కులధ్రువీకరణ పత్రాలను మాత్రమే అనుమతిస్తారన్నారు. సందేహాల నివృత్తికి 0884-2340535, 2356255, 0884-23405459 (ఫ్యాక్సు), 18004256755 (టోల్‌ఫ్రీ) నంబర్లలో లేదా apeamcet2k16@gmail.com ద్వారా సంప్రదించవచ్చన్నారు.
Published date : 04 Apr 2016 01:58PM