Skip to main content

మే 18లోగా ఎంసెట్ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కూడా భారీగా సీట్లు తగ్గనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీలు చేపట్టిన కసరత్తు పూర్తికావచ్చింది. అనుబంధ గుర్తింపు జాబితాలను ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం వర్సిటీలు సిద్ధం చేస్తున్నాయి.
ముఖ్యంగా జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లోనే అత్యధికంగా సీట్లకు కోత పడే పరిస్థితులు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి అంచనా వేస్తోంది. కొన్ని కాలేజీల్లో ల్యాబ్‌లు లేకపోయినా కోర్సులను నిర్వహిస్తున్నట్లు జేఎన్‌టీయూ తనిఖీల్లో తేల్చింది. మరో 36 కాలేజీల్లో ఫ్యాకల్టీ సమస్య అధికంగా ఉన్నట్లు అంచనాకు వచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకున్నా ఆయా కాలేజీలు కోర్సులను నిర్వహిస్తున్నట్లు తేల్చింది. దీంతో 10 వేల వరకు సీట్లకు కోత విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 14 కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు నిరాకరించడంతో పాటు మొత్తంగా 10,122 సీట్లకు కోత విధించింది.

గతేడాది 27 వేల సీట్లకు కోత..
2017-18లో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా.. జేఎన్‌టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. ఈసారి ఏఐసీటీఈ 10,122 సీట్లను తగ్గించిన నేపథ్యంలో యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే సీట్ల సంఖ్య గతేడాది కంటే భారీగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. పైగా వరుసగా మూడేళ్లలో 25 శాతం లోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించడంతో భారీగా సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే గతంతో పోల్చితే కాలేజీలు చాలా వరకు తమ లోపాలను సరిదిద్దుకున్నాయని, అయినప్పటికీ ఇంకా కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు తేలింది.

ఎంసెట్ ప్రాథమిక ‘కీ’పై 400 అభ్యంతరాలు..
రాష్ట్రంలో మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎంసెట్ ప్రాథమిక ‘కీ’లపై దాదాపు 400 అభ్యంతరాలు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. అయితే వాటిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేశారు. మొత్తానికి మే 18వ తేదీన, వీలైతే అంతకంటే ముందుగానే ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేందుకు జేఎన్‌టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published date : 15 May 2018 01:47PM

Photo Stories