Skip to main content

జూన్ మొదట్లో ఎంసెట్ కౌన్సెలింగ్ !

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్ పరీక్ష నిర్వహించి దాదాపు నెలరోజులు అవుతున్నా కౌన్సెలింగ్ చేపట్టడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
కౌన్సెలింగ్ ప్రక్రియను మే 26వ తేదీనుంచి ప్రారంభిస్తామని ఎంసెట్ ఫలితాల ప్రకటన సందర్భంగా, ఆ తరువాత కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే చెప్పిన సమయానికి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జూన్ మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితుల్లేవని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ కన్నా ఏపీ ఎంసెట్‌ను పది రోజులు ముందుగా నిర్వహించినా కౌన్సెలింగ్‌లో మాత్రం ఆలస్యం జరుగుతోంది.

తెలంగాణలో షెడ్యూల్ విడుదల :
ఏపీ ఎంసెట్‌ను ఏప్రిల్ 21 నుంచి 25వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను మే 2న విడుదల చేశారు. తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను మే 19న రోజు ప్రకటించిన అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా వెంటనే ప్రకటించారు. మే 25నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. జూన్ 8న సీట్ల కేటాయింపు ఉంటుందంటూ తెలంగాణలో షెడ్యూల్ విడుదల చేశారు.

అఫ్లియేషన్ పూర్తికాకపోవడంతో..
ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతి వచ్చి వారం దాటుతోంది. దీనిపై సాంకేతిక విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురంలు కాలేజీల పరిశీలన పూర్తిచేసి అఫ్లియేషన్ ఇవ్వాలి. ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదని సమాచారం. ఎక్కువ కాలేజీలు కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోనే ఉన్నాయి. అఫ్లియేషన్ గురించి ఉన్నత విద్యామండలి పలుమార్లు వర్సిటీ అధికారులను సంప్రదించగా మే 30 నాటికి కానీ ప్రక్రియ పూర్తి కాదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ లెక్కన జూన్ మొదటి వారంలో గానీ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించే అవకాశాల్లేవని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని నిర్ణయించడం కూడా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఆలస్యానికి కారణమవుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ పరిశీలనకు సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తికాలేదు. తరువాత సంబంధిత డేటాను వివిధ శాఖల నుంచి తెప్పించి అనుసంధానించాల్సి ఉంది. మరోపక్క ఆన్‌లైన్ పరిశీలనకు సంబంధించి పలువురు అభ్యర్థులు తమ సమాచారాన్ని నమోదు చేయలేదు. ఈ సమాచారం లేకుండా సర్టిఫికెట్ల పరిశీలన సాధ్యం కాదు. తప్పుల తడకలుగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగి దాని ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే గందరగోళానికి దారితీసేప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, ఎంసెట్ ఫలితాలు మే 2న విడుదల చేసినా కౌన్సిలింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంపై మంత్రి గంటా.. అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కౌన్సిలింగ్‌లో జాప్యంపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Published date : 21 May 2018 05:31PM

Photo Stories