Skip to main content

జులై 20 నుంచి ఎంసెట్ రెండోవిడత కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్-2017 రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు.
రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనుంది. వెబ్ ఆప్షన్లను కూడా అభ్యర్థులు 20వ తేదీ నుంచే నమోదుచేసుకోవచ్చు. ఈ నెల 24న సీట్ల కేటాయింపు చేస్తారు. మొదటి విడతలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారు కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పండాదాస్ తెలిపారు. అయితే దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రం ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం ఇవ్వరు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారు కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అయితే రెండో విడత కౌన్సెలింగ్‌లో సీటు కేటాయింపు జరిగితే మొదటి విడత సీటు వెంటనే రద్దయిపోతుంది. రాష్ట్రంలో 313 ఇంజినీరింగ్, 120 ఫార్మా కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 98,882 సీట్లుండగా.. మొదటి విడతలో 69,116 సీట్లు కేటాయించారు. ఇందులో 11,186 మంది చేరలేదు. మొత్తం 40,952 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులూ అప్షన్లు ఇచ్చుకోవచ్చు...
ఎన్‌సీసీ, స్పోర్‌‌ట్స కోటా అభ్యర్థులకు మొదటి విడతలో సీట్ల కేటాయింపు జరగలేదు. వారికి సంబంధించిన ఖాళీలను ఈరెండో విడత కౌన్సెలింగ్‌లో పెడుతున్నామని, జాబితాను చూసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించి జేఈఈ ప్రక్రియపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేయడంతో ఆ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ఆ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగియనుంది. ఆయా సంస్థల్లో సీట్లు పొందిన వారు ఎంసెట్‌లో వచ్చిన సీట్లను వదులుకునే పరిస్థితి ఉంది. అలా ఖాళీ అయ్యే వాటిని కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లోని అభ్యర్థులకు కేటాయించేందుకు అవకాశాలున్నాయి.
Published date : 11 Jul 2017 02:23PM

Photo Stories