Skip to main content

జూలై 1నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు జూన్ 12న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు అధ్యక్షతన జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూలై ఒకటో తేదీనుంచి నాలుగో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 4, 5 తేదీల్లో ఆప్షన్ల నమోదు, 7న సీట్ల కేటాయింపు ఉంటుందని కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన ఎన్‌సీసీ, స్పోర్ట్సు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు ఈ విడతలో కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు. వీరు తమ సర్టిఫికెట్ల పరిశీలనకు విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ, విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, తిరుపతిలోని ఎస్‌వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలను ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ https://apeamcet.nic.in ను సందర్శించాలన్నారు. ఇంతకు ముందు కౌన్సెలింగ్‌లో పాల్గొనని వారు, సీట్లు రాని వారు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చన్నారు.

రిపోర్టింగ్ చేయడానికి జూన్ 15వతేదీ వరకు గడువు పొడిగింపు :
మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి నిర్దేశించిన గడువును జూన్ 15 వరకు పొడిగించారు. కేటాయింపులకు సంబంధించి ఆప్షన్లలో కులం, స్థానికత, ఇతర అంశాల్లో తప్పులు దొర్లి ఉంటే కమిషనరేట్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. లేదా convenerapeamcet2018@gmail.com కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఇన్‌కమ్ సర్టిఫికెట్ల అప్‌డేట్ కోసం హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఇక బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.

ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించవద్దు..
చివరి విడత కౌన్సెలింగ్ ముగిసే వరకు ఆయా కాలేజీల్లో చేరే విద్యార్థులు ఫీజులు, ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ పలు కాలేజీలు వీటిని ధిక్కరిస్తున్నాయి.
Published date : 13 Jun 2018 03:59PM

Photo Stories