Skip to main content

జూలై 1 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్-2019 కౌన్సెలింగ్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. దీనికి నోటిఫికేషన్ జూన్ 24న విడుదల కానుంది. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాలను జూలై 1 నుంచి పరిశీలిస్తారు. అదే నెల 4 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
11న సీట్లు కేటాయించి 15 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేపట్టింది. ఏపీ ఎంసెట్‌ను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ విభాగంలో 1,85,711 మంది పరీక్ష రాయగా 1,38,160 మంది, అగ్రి, మెడికల్ విభాగంలో 81,916 మంది పరీక్ష రాయగా 68,512 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ విభాగంలో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 95,220 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. తక్కిన విద్యార్థులు జూలై 1 నుంచి జరిగే కౌన్సెలింగ్‌లో ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవాలి. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు మళ్లీ హాజరవ్వాల్సిన అవసరం లేదు. ఈ మేరకు విద్యార్థుల ఫోన్ నెంబర్లకు సంక్షిప్త సమాచారాన్ని పంపినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు వివరించాయి.

కౌన్సెలింగ్ ఇలా..:
ధ్రువపత్రాల పరిశీలన పూర్తికానివారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు టెన్త్, ఇంటర్ మార్కుల మెమోలు, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కులధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, రెసిడెన్స్‌ సర్టిఫికెట్ (స్టడీ సర్టిఫికెట్ లేనివారు) తీసుకువెళ్లాలి. సాంకేతిక కారణాలతో వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న 30 వేల మంది వరకు మాత్రమే పరిశీలన చేయించుకోవాలి. తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందా, లేదా అనే విషయం తెలుసుకోవడానికి విద్యార్థులు https://apsche.org/cetstatus.php వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాని వారు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 24 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పరిశీలన చేయించుకున్న అనంతరం ప్రాసెసింగ్ ఫీజు రూ.1,200 (ఎస్సీ, ఎస్టీలకు రూ.600) చెల్లించాల్సి ఉంటుంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు అర్హులై ఉండి పొరపాటున ‘నో’ అని నమోదు చేసిన విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెరిఫికేషన్ చేయించుకుని సరిచేయించుకోవాలని అధికారులు సూచించారు.

302 ఇంజనీరింగ్, 127 ఫార్మసీ కళాశాలలకు అనుమతి..:
2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 302 ఇంజనీరింగ్, 127 ఫార్మసీ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఈ కళాశాలల్లో 1,53,331 ఇంజనీరింగ్ సీట్లకు, 11,139 ఫార్మసీ సీట్లకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు కాలేజీల్లో 1,40,763 సీట్లుండగా ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలకు చెందిన 12 కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు 3,670 ఉండగా, 6 ఫార్మా కాలేజీల్లో 360 సీట్లు ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది అత్యధిక శాతం సీట్లు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం కాలేజీల ఫీజులను అమాంతం పెంచేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం రూ.35 వేలకే పరిమితం చేయడంతో విద్యార్థులపై అధిక భారం పడింది. దీంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరిపోయేవారు.

గతేడాది సీట్ల భర్తీ ఇలా..
కోర్సు వర్సిటీ కాలేజీలు సీట్లు కాలేజీలు భర్తీ ప్రైవేటు సీట్లు భర్తీ
ఇంజనీరింగ్ 20 4,834 4,642 285 1,34,142 79,372
ఫార్మసీ 7 410 406 112 11,360 8,703
మొత్తం 27 5,244 5,048 397 1,45,502 88,075
Published date : 24 Jun 2019 06:44PM

Photo Stories