Skip to main content

ఈసారి లేటైనా.. 60 వేల సీట్లకు పైగా భర్తీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, ఫార్మా-డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ కొద్దిరోజులు ఆలస్యమైనా దానివల్ల విద్యార్థులకు, కాలేజీలకు మేలే జరిగింది.
సీట్ల భర్తీ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు అదే స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఇతర సంస్థల్లో సీట్లు పొందడం ద్వారా ఇక్కడి సీట్లను వదిలివెళ్లే వారి సంఖ్య కూడా ఈసారి దాదాపు లేదనే చెప్పుకోవచ్చు. అదే సమయంలో మెరిట్‌లో ఉన్న వారందరికీ కోరుకున్న కాలేజీలో, ఆశించిన కోర్సులో సీటు పొందేందుకు ఈసారి అవకాశం చిక్కిందని అధికారులు చెబుతున్నారు. కిందటేడాది ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి మొత్తం 95,455 సీట్లలో 62,600 సీట్లు భర్తీ అయ్యాయి. అదే ఈసారి ఈడబ్లూఎస్ కోటా కారణంగా సీట్ల సంఖ్య 1,06,030కి పెరగ్గా.. భర్తీ అయిన సీట్ల సంఖ్య 60,862. కౌన్సెలింగ్ ఆలస్యం అయినా దాని ప్రభావం సీట్ల భర్తీపై పెద్దగా లేదు. మధ్యలో సీట్లు ఖాళీ అయ్యే అవకాశం కూడా ఈసారి లేదు. ఎందుకంటే ఇప్పటికే జాతీయస్థాయిలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఐటీ వంటి విద్యా సంస్థల ప్రవేశాలు దాదాపు ముగిశాయి. వాటిలో సీట్లు పొంది ఇక్కడ కేటాయింపైన సీట్లను వదులుకునే విద్యార్థులు దాదాపు లేనట్లే. దీనివల్ల కాలేజీలకు మేలు జరుగుతుండగా అదే సమయంలో ఆ సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ అవుతున్నందున విద్యార్థులపై ఫీజుల భారం కూడా తప్పుతోంది.

ఈసారి ఆలస్యానికి కారణాలెన్నెన్నో..
ఎంసెట్‌లో కౌన్సెలింగ్ ప్రక్రియ ముఖ్యంగా సీట్ల కేటాయింపు గత ఏడాదికన్నా ఈసారి పలు కారణాలవల్ల ఆలస్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు 2018 ఎంసెట్‌లో జూన్ 5న చేయగా ఈసారి ఆగస్టు 3 వరకు చేయలేకపోయారు. ఈ ఏడాదిలో ఎంసెట్‌ను గతంలో కన్నా ముందుగా ఏప్రిల్ 20-24 తేదీల్లో ముగించారు. అయితే, తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం ఎంసెట్ ఫలితాల విడుదలకు ఆటంకంగా మారింది. జూన్ 4న ఫలితాలు విడుదల చేశారు. తరువాత ఏఐసీటీఈ నుంచి కాలేజీలకు అనుమతులు రావడం, వర్సిటీల పరిశీలన, అఫ్లియేషన్ల జారీ వంటి ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆ ప్రభావం కౌన్సెలింగ్‌పై పడింది. ఇదే సమయంలో ఎన్నికల కారణంగా చివరకు జూన్ 24న కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అలాగే, ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి గత ప్రభుత్వం కాపులకు 5 శాతం, ఇతర అగ్రవర్ణ పేదలకు 5 శాతం అని రెండుగా విభజిస్తూ జీవో ఇవ్వడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఇచ్చిన కోటాను రాష్ట్రంలో విభజించి అమలుచేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చేలా ఉండడంతో మొత్తం సీట్లను కాపులతో కలుపుకుని అగ్రవర్ణ పేదలకు కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ సీట్లకు సంబంధించిన విధివిధానాలు కొంత చిక్కుముడిగా మారడంతో వెబ్ ఆప్షన్ల నమోదు ఆలస్యమైంది. చివరకు ఈ ఏడాది జూలై 27 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదును చేపట్టి ఆగస్టు 3న సీట్లు కేటాయించారు.

రెండో విడతలో ఈడబ్ల్యూఎస్ కోటా భర్తీ :
ఈసారి కొత్తగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9,560 సీట్లు అదనంగా కేటాయించారు. వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీచేశారు. గత ఏడాదిలో రెండో విడత కౌన్సెలింగ్‌ను జూన్ 20న చేపట్టగా ఈసారి ఆగస్టు 6న చేపట్టారు. సీట్ల కేటాయింపు గత ఏడాది జూలై 7వ తేదీకి పూర్తికాగా ఈసారి ఆగస్టు 14న కేటాయించారు.
ఈ ఏడాది రెండో విడత అనంతరం సీట్ల భర్తీ ఇలా..
ఏడాది కాలేజీలు సీట్లు భర్తీ ఖాళీ
2018 460 95,455 62,600 32,855
2019 440 1,06,030 60,862 45,168
Published date : 16 Aug 2019 04:50PM

Photo Stories