Skip to main content

ఇంజనీరింగ్‌కు ఒకే ఎంట్రన్స్‌!

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఏకీకృత ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్డీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది.
రెండేళ్ల కిందట 2014 నుంచే జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ద్వారా ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షల నిర్వహణ వల్ల అక్రమాలకు ఆస్కారముండటం, లోపాలు తలెత్తడం వంటి అంశాలను పరిగ ణనలోకి తీసుకున్న హెచ్‌ఆర్డీ 2018 నుంచి జేఈఈ ద్వారానే ఇంజనీరింగ్‌ సీట్లను భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఏకీకృత పరీక్షకు మొగ్గు చూపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుత విధానంలో అనేక లోపాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, ఇంజనీరింగ్‌ కళాశాలలు యాజమాన్య సీట్ల పేరుతో అడ్డగోలుగా సీట్లు విక్రయిస్తున్నాయని నివేదించింది. దానికి గాను గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఇంజనీరింగ్‌ విద్యలో పడిపోతున్న ప్రమాణాలు, బోధన సిబ్బంది కొరత వంటి అంశాలను కూడా కమిటీ ఆ నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ ద్వారా మాత్రమే దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు జరపాలని సిఫారసులు చేసింది. వచ్చే ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించినా, సమయాభావంతో సాధ్యం కాదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సూచించడంతో 2018కి వాయిదా వేసింది. ఏకీకృత ప్రవేశ పరీక్ష అమల్లోకి వస్తే ఎంసెట్‌ నిర్వహణ ఉండదు.
Published date : 24 Dec 2016 02:31PM

Photo Stories