Skip to main content

EAMCET: ఇన్ని వేలలోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తి ఫీజు చెల్లింపు

EAMCETలో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, Economically Weaker Section (EWS) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
EAMCET
ఇన్ని వేలలోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తి ఫీజు చెల్లింపు

ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని టాప్‌–10 Engineering కాలేజీల్లో వార్షిక ట్యూషన్‌ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్‌ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్‌ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్‌ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. 

చదవండి: Top 20 Artificial Intelligence and Data Science Engineering college : బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. ఈ బ్రాంచ్‌లో చేరితే..

సీఎం సానుకూలంగా స్పందించినా.. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో ర్యాంకు సీలింగ్‌ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్‌ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్‌ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్‌ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్‌ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. 

చదవండి: Engineering colleges Admissions : ఇంజ‌నీరింగ్ కాలేజ్‌ ఎంపికలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. ఇవే కీలకం..

వారిలో సగం మందే బీసీలు 

ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్‌ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్‌ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. 

చదవండి: Top 20 Engineering (Information Technology) Colleges : టాప్‌-20 ఐటీ ఇంజనీరింగ్(IT) కాలేజీలు ఇవే..

విఘ్నేష్‌ కుమార్‌ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్‌లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్‌తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని భావించిన విఘ్నేష్‌ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్‌ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేయాలనే డిమాండ్‌ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్‌ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్‌ ఇయర్‌ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 

Published date : 05 Sep 2022 01:37PM

Photo Stories