ఏపీలో వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్
Sakshi Education
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో 13 జిల్లాల ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న జరగనున్న ఎంసెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షకు చేతి గడియారాలకు అనుమతి లేనందున ప్రతి కేంద్రంలోనూ గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద భద్రతపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
Published date : 19 Apr 2016 03:29PM