ఏపీలో ముగిసిన ఎంసెట్ రెండో విడత వెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి బుధవారం వెబ్ ఆప్షన్ల గడువు ముగిసింది. మొత్తం 38,175 మంది విద్యార్థులు 7,42,738 ఆప్షన్లు నమోదు చేశారు.
రెండో విడతలో కొత్త విద్యార్థులు 4,612 మంది కాగా మిగతా వారందరూ మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్ని సీట్లు అలాటైన వారే కావడం గమనార్హం. ఒక్కో అభ్యర్థి 1700 వరకు ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ సంఖ్య లక్షల్లో నమోదైంది. మొదటి విడతలో ఎంచుకున్న కాలేజీల్లో తక్కువ సీట్లు భర్తీ కావడంతో విద్యార్థులు కాలేజీ మారడానికి నిర్ణయించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొదటి విడతలో పాల్గొన్న వారు అధిక సంఖ్యలో రెండో విడతలోనూ పాల్గొనడంతో కాలేజీల వారీగా సీట్ల కేటాయింపుల్లో భారీ మార్పులు జరగనున్నాయి. మొదటి విడతలోనే అనేక కాలేజీల్లో సీట్లకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వలేదు. సగానికిపైగా కాలేజీల్లో 50 శాతం సీట్లకు కూడా ఆప్షన్లు నమోదు కాలేదు. ఇక రెండో విడతలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు అలాటైన విద్యార్థులు కూడా పాల్గొనడంతో ఆయా కాలేజీల్లో భయం మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 343 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా మొదటి విడతలో 7 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదైయ్యాయి. 10 మంది నుంచి 50 శాతం సీట్లు అలాటైన కాలేజీలు 180 ఉన్నాయి. ఇప్పుడు జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీల సంఖ్య పెరగనుంది. రెండో విడతలో సీట్లు కోల్పోయే కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. తక్కువ సీట్లు భర్తీ అయితే నిర్వహణలో ఆనేక సమస్యలు ఎదురుకానున్నాయి.
Published date : 16 Jul 2015 01:05PM