Skip to main content

ఏపీ ఎంసెట్‌పై అంచనాలు తారుమారు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 13 జిల్లాల్లో నిర్వహించిన ఎంసెట్ పలువురి అంచనాలను తారుమారు చేసింది. శుక్రవారం నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు గణాంకాలను పరిశీలిస్తే.. ఏపీ కాలేజీల్లో సీట్ల భర్తీ పెరిగినట్లు తెలుస్తోంది.
గతేడాది ఆరు వేల ర్యాంకుకు రాయలసీమలోని ఒక యూనివర్సిటీ కాలేజీలో సీటు రాగా ఈసారి ఆ ర్యాంకు అభ్యర్థికి ప్రైవేట్ కళాశాలలో సీటు లభించింది. మంచి ర్యాంక్ వచ్చినవారు కూడా ఒకింత నిరాశకు గురయ్యారు. మంచి సీట్లు వస్తాయనుకున్నవారి అంచనాలు తారుమారయ్యాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టాప్ కాలేజీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. మెరిట్ విద్యార్థులు హైదరాబాద్‌లోనే చేరేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఏపీలోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోని ఎంసెట్‌లోకంటే ఈసారి ఏపీలోని కాలేజీల్లో ప్రవేశాలు పెరిగాయి. ముందస్తుగా కౌన్సెలింగ్ పూర్తిచేయడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కంటే ఏపీలోని కాలేజీల్లో చేరడానికే మొగ్గు చూపారు. దీనివల్ల కాలేజీల్లో సీట్ల భర్తీ పెరిగింది. గతేడాది ఎంసెట్‌లో ఏపీలోని 13 జిల్లాల్లో అర్హత సాధించిన వారు 67 వేల మంది ఉండగా ఈసారి 82 వేల మంది అర్హత సాధించారు. క్రితంసారి ఏపీలోని కాలేజీల్లో 57 వేల మంది చే రగా ఈసారి 80 వేల మందికిపైగా సీట్లు పొందారు. వీరిలో దాదాపు 75 వేల మంది కాలేజీల్లో చేరనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీలతో పాటు ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కాక ముందే ఏపీలో కౌన్సెలింగ్ పూర్తిచేయడం విశేషం.

మెరిట్ విద్యార్థులు ఏపీలోనే..
మెరిట్ సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏపీ కాలేజీలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గతేడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు 238వ ర్యాంకు నుంచి ప్రారంభించగా ఈసారి 17వ ర్యాంకు నుంచి ప్రారంభం కావడం గమనార్హం. 5 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారు గతంలో ఏపీ కాలేజీల్లో చేరడం కష్టంగా ఉండేది. ఇప్పుడు వారంతా రాష్ట్ర కాలేజీల్లోనే సీటు పొందారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో మొత్తం 36 బ్రాంచిలుండగా అందులో 14 బ్రాంచిలకు మాత్రమే ఆప్షన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ 14 బ్రాంచిల్లోనూ సీఈసీ, ఈసీఈ, మెకానికల్, సివిల్ తదితర కోర్సులకే ఎక్కువ మంది ఆప్షన్ పెట్టుకున్నారు.

దేశంలోనే మొదటిసారి
ఇంజనీరింగ్ ప్రవేశాలను దేశంలోనే మొట్టమొదట పూర్తిచేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని రాష్ట్ర ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ పేర్కొంది. ‘‘గతంలో సెప్టెంబర్, అక్టోబర్‌లలో కానీ ప్రవేశాలుండేవి కావు. ఈసారి జూన్‌లోనే ముగించి, జూలైలో తరగతులు ప్రారంభిస్తుండడం ఒక రికార్డు. కాలేజీలను జులై 2నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయం’’ అని సంఘం ప్రతినిధులు శాంతి రాముడు, ఎన్.విజయభాస్కర చౌదరి తెలిపారు.
Published date : 27 Jun 2015 01:16PM

Photo Stories