ఏపీ ఎంసెట్‌లో 64 వేల మంది వెబ్ ఆప్షన్లు నమోదు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్- 2019 కౌన్సెలింగ్‌కు 64,192 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
ఆగస్టు 2వ తేదీ సాయంత్రానికి ఆప్షన్లలో మార్పులు చేర్పుల గడువు కూడా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4న వీరికి సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే కాలేజీల ఫీజులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో సీట్ల కేటాయింపునపై కొంత సందిగ్ధద నెలకొంది. హైకోర్టు ఉత్తర్వులను వెకేట్ చేయించకుండా సీట్లు కేటాయిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోర్టు తుది తీర్పు మేరకు ఫీజులుంటాయన్న షరతులతో సీట్ల కేటాయింపునకు అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Published date : 03 Aug 2019 02:29PM