ఏపీ ఎంసెట్‌కు 2,71,787 దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌కు గతేడాది కంటే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య తగ్గింది.
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు మార్చి 29తో గడువు ముగిసింది. కాగా ప్రస్తుతం వివిధ ఆలస్య రుసుములతో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నారు. ఏప్రిల్ 3 నాటికి మొత్తం 2,71,787 ఆన్‌లైన్ దరఖాస్తులందాయి. ఇందులో 1,96,139 మంది ఇంజనీరింగ్‌కు; అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు 74,571 మంది, రెండు పరీక్షలకు కలిపి 1077 మంది దరఖాస్తు చేశారు. గతేడాది ఎంసెట్‌కు 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఏకంగా 8 వేల దరఖాస్తులు తగ్గాయి. ఇందులో అగ్రి, మెడికల్ ప్రవేశపరీక్షకు 7 వేలకు పైగా దరఖాస్తులు తగ్గాయి. కాగా, ఈసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆన్‌లైన్లోనే చేపడుతున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఆన్‌లైన్లో సమర్పించిన ఆయా సర్టిఫికెట్లను సంబంధిత శాఖల ద్వారా ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ పరీక్ష, 25, 26 తేదీల్లో మూడు సెషన్లలో అగ్రి, మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున త్వరగా ఫలితాల విడుదలకు అవకాశముంది.
Published date : 04 Apr 2018 02:55PM