ఏపీ ఎంసెట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు ఈ ఏడాది ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో చక్కని ప్రతిభ కనబరిచారని సంస్థ కార్యదర్శి వి. రాములు జూన్ 4న ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి మొత్తం 2,527 మంది విద్యార్థులు హాజరయ్యారని.. ఇంజనీరింగ్ విభాగంలో 1,222 మందికి గాను 1,086 మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన వివరించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో మొత్తం 1,305 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1,181 మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొన్నారు. ఐఐటీ, మెడికల్ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు పి. తిరుమలేష్ నాయక్ 1,728 ర్యాంకు, ఎం. పవన్‌సత్య 2,100వ ర్యాంకు సాధించగా.. ఇంజనీరింగ్ విభాగంలో బి. రఘుబాబు 6,936 ర్యాంకు సాధించారని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించారని.. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, ఇందుకు కారణమైన ఉపాధ్యాయులకు సంస్థ వైస్ చైర్మన్ ఎస్‌ఎస్ రావత్ అభినందనలు తెలిపారు.
Published date : 05 Jun 2019 03:51PM