Skip to main content

ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు సూచనలు

ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించే ఏపీ ఎంసెట్-2016కు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు.
ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 355 కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ 191 కేంద్రాల్లోను జరుగుతుందన్నారు. హైదరాబాద్ జోన్-ఎలో 12, జోన్-బిలో 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. రూ. 10 వేల ఫైన్‌తో హాజరయ్యే 88 మందికి కాకినాడ జేఎన్‌టీయూలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష పత్రాన్ని శుక్రవారం ఉదయం మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెడిసిన్ పరీక్ష పత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఎంపిక చేస్తారు.

ఎంసెట్ విద్యార్థులకు కొన్ని సూచనలు:
  • పరీక్ష రోజున ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకం చేయాలి.
  • హాల్‌టికెట్‌లో తప్పులు దొర్లితే పరీక్ష రోజున ఇచ్చే నామినల్ రోల్స్‌లో ఇన్విజిలేటర్ సమక్షంలో సరి చేసుకోవచ్చు.
  • పరీక్ష సమయానికి 2 గంటల ముందే నిర్ధేశిత కేంద్రానికి చేరుకోవాలి. హాలులోనికి గంట ముందు అనుమతిస్తారు.
  • నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించరు.
  • విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు, ధ్రువీకరణ పత్రాలు, రెండు పెన్నులు మాత్రమే తీసుకురావాలి.
  • ఓఎంఆర్ షీట్‌ను నీలం లేదా నలుపు పెన్నులతోనే పూరించాలి. పెన్నులు మధ్యమధ్యలో మార్చకూడదు.
  • పరీక్ష సమయం పూర్తయ్యే వరకూ హాలు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు.
  • రఫ్ వర్క్ క్వశ్చన్ పేపర్‌పైనే చేసుకోవాలి.
  • ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థి తన ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, టెస్ట్ సెంటర్ కోడ్, పేరు, లోకల్ ఏరియా, కేటగిరీ, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్‌పై ఉన్న కోడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. సమస్య ఉంటే ఇన్విజిలేటర్ చెప్పాలి.
  • ఓఎంఆర్ షీట్‌పై ఏ కోడ్ ఉంటే అదే కోడ్ ఉన్న క్వశ్చన్ పేపర్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలి.
Published date : 28 Apr 2016 12:07PM

Photo Stories