Skip to main content

ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడసిటీ): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 2018-19 విద్యా సంవత్సరపు ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు ఫిబ్రవరి 26న విడుదల చేశారు.
బీటెక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ బీఫార్మసీ, ఫార్మా డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, క్రెడిట్, డెబిట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా రూ. 500(ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి) రుసుము చెల్లించి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 28 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటికీ హాజరుకాదల్చుకున్న వారు రూ. 1,000 చెల్లించాలి. అపరాధ రుసుము లేకుండా మార్చి 29వ తేదీతో గడువు ముగియనుంది. అపరాధ రుసుము రూ. 500తో ఏప్రిల్ 6 వరకు, రూ. 1,000తో ఏప్రిల్ 11 వరకు, రూ. 5 వేలతో ఏప్రిల్ 16 వరకు, రూ. 10వేలతో ఏప్రిల్ 21వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం ఇలా..
విద్యార్థులు ముందుగా www.sche.ap.gov.in/eamcet  వెబ్‌సైట్లో ఫీజును చెల్లించిన అనంతరం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్ నంబర్, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ, విద్యార్థి ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా దరఖాస్తులో నమోదు చేయాలని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. వీటితోపాటు కులధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీ, బీసీ), రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం, స్టడీ సర్టిఫికెట్‌లు/నివాస ధ్రువీకరణ పత్రాలను తమ వద్ద ఉంచుకొని జాగ్రత్తగా ఆయా కాలమ్‌లను పూరించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఒకసారి మాత్రమే ఆన్‌లైన్లో ఆమోదం అవుతుంది. ఫీజు చెల్లింపు అనంతరం ఆయా వివరాలతో పాటు పేమెంటు రిఫెరెన్సు ఐడీ నంబర్ విద్యార్థి ఫోన్‌కు సంక్షిప్త సమాచారం ద్వారా అందుతుంది. ఈ సమాచారాన్ని విద్యార్థి భవిష్యత్తులో కూడా వినియోగించుకోవలసి ఉంటుంది కనుక జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సాయిబాబు సూచించారు.

ఏప్రిల్ 22 నుంచి 26 వరకు పరీక్షలు :
ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 22 నుంచి 25వరకు జరుగుతుంది. అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరగనుంది. రోజూ రెండు సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో మూడు రీజనల్ సెంటర్లకు ఆప్షన్ ఇవ్వాలి. అందులో ఒక సెంటర్‌లోని పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. ఏప్రిల్ 18 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉర్దూ అనువాద పరీక్షకు హాజరయ్యే వారికి కర్నూలులో మాత్రమే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తామని కన్వీనర్ వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.

ఎంసెట్ కేంద్రాలు ఇవే..
శ్రీ‌కాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసారావుపేట, బాపట్ల, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, గుత్తి, హిందూపురం, కర్నూలు, నంద్యాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సందేహాల నివృత్తికి 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

40 మార్కులు వస్తేనే కోర్సులో ప్రవేశార్హత..
ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్లో అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్నందున.. ఒకరికి కష్టంగా వేరొకరికి సులభంగా వచ్చేలా కాకుండా 5 రోజుల్లో అందరికీ ప్రశ్నలు సమానంగా వచ్చేలా సాధారణీకరణ పద్ధతిని అనుసరించనున్నామని, అభ్యర్థులు ఒకరితో ఒకరు పోల్చుకొని ఆందోళన చెందనవసరం లేదని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు తెలిపారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం సాధారణీకరణ పద్ధతిలోనే మూల్యాంకనం ఉంటుందన్నారు. ఎంసెట్ పరీక్షను ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండిటిలోనూ 160 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఎంపీసీ విద్యార్థులకు గణితం నుంచి 80, ఫిజిక్సు నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. బైపీసీ విద్యార్థులకు ఫిజిక్సు నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, బోటనీ నుంచి 40, జువాలజీ నుంచి 40 మార్కులకు మొత్తం 160 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఆన్‌లైన్లో బహుళైచ్ఛిక సమాధానాల విధానంలో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. ఎంసెట్‌లో 75 శాతం, ఇంటర్మీడియెట్ 25 శాతం మార్కులను వెయిటేజీగా తీసుకొని ర్యాంకును నిర్ణయిస్తారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌లో అభ్యర్థులు 40 శాతం అర్హత మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కుల నుంచి మినహాయింపునిచ్చారు.
Published date : 27 Feb 2018 02:43PM

Photo Stories