ఎంసెట్‌లో 110 ప్రశ్నలపై అభ్యంతరాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఏపీ ఎంసెట్-2017లో 110 ప్రశ్నల పై అభ్యంతరాలు వచ్చాయి.
ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తప్పుగా ఉన్నాయనో, అసలు ప్రశ్నే తప్పుగా ఉందనో అభ్యర్ధులు అభ్యంతరాలు వ్యక్తపరిచారు. వీటిపై పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఏపీ ఎంసెట్ కమిటీ నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం ఈనెల 3న సమావేశమై అభ్యంతరాలను పరిశీలిస్తుంది. ఇంజనీరింగ్‌లో 70 ప్రశ్నలకు, బైపీసీ స్ట్రీమ్‌లో 40 ప్రశ్నలకు అభ్యంత రాలు అందాయి. ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష , 28వ తేదీన బైపీసీ స్ట్రీమ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఓఎమ్మార్ పత్రాల ఆధారంగా ఒక్కొక్క రోజులో జరిగే ఎంసెట్‌లోని ప్రశ్నల్లో ఇంజనీరింగ్, బైపీసీ స్ట్రీమ్‌లు రెండిం టికీ కలిపి గరిష్ఠంగా 10 నుంచి 15 అభ్యంతరాలు వచ్చేవి. కానీ ఈసారి ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ను నిర్వహించడంతో అభ్యంతరాల సంఖ్య భారీగా పెరిగింది. నిపుణుల కమిటీ ఈ అభ్యంతరాలను పరిశీలించి ఎంసెట్ కమిటీకి నివేదికను అందిస్తుంది. అనంతరం కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇలా ఉండగా ఎంసెట్ ఫలితాలు ఈనెల 5న విజయవాడలోని స్టేట్ గెస్టు హౌస్‌లో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు పేర్కొన్నారు.
Published date : 03 May 2017 01:54PM