ఎంసెట్‌కు మూడోవిడత కౌన్సెలింగ్!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని సీట్లు ఈ ఏడాది భారీగా మిగిలిపోతుండటంతో మూడో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ భావిస్తోంది. దీనిపై ఆగస్టు ఒకటో తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు 18, ఫార్మా కాలేజీలు 7 ఉండగా రెండింటిలో కలిపి 4,646 సీట్లు, ప్రయివేటులో 282 ఇంజనీరింగ్, 112 ఫార్మా కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటాలో 94,605 సీట్లు ఉన్నాయి. వీటిలో యూనివర్సిటీ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లన్నీ భర్తీ అవగా, ఫార్మా సీట్లు 116 మిగిలాయి. ప్రయివేటులో ఇంజనీరింగ్‌లో 28,216, ఫార్మాలో 31,23 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు భారీగా మిగిలిపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పలు కాలేజీల నుంచి కూడా మూడో విడత కౌన్సెలింగ్‌కు వినతులు అందుతుండటంతో దీనిపై సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఆగస్టు తొలివారంలో ఈ కౌన్సెలింగ్ నిర్వహించేలా తేదీలు నిర్ణయించింది. వీటిపై అడ్మిషన్ల కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
Published date : 31 Jul 2017 02:19PM