Skip to main content

ఎంసెట్ వెయిటేజీ తొలగిద్దామా...?

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ తొలగిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు మొదలయ్యాయి.
జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్‌‌సడ్‌లోనే ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించినందున ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ అవసరమా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ అంశం తెరపైకి వచ్చింది.

గ్రేడింగ్ విధానమే..
కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్‌లో మార్కులొద్దని, గ్రేడింగ్ విధానమే మంచిదని అధికారులు భావిస్తున్నారు. 2018 మార్చిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ప్రైవేటు యాజమాన్య ప్రతినిధుల భాగస్వామ్య బోర్డు సలహా మండలి ఇటీవల పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది. అయితే మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానం అమల్లోకి తెస్తే ఎంసెట్ ర్యాంకుల్లో పరిగణనలోకి తీసుకుంటున్న 25 శాతం వెయిటేజీ ఎలా అన్న దానిపైనా చర్చించింది. ఇందులో మూడు ప్రతిపాదనలు చేసింది.

వెయిటేజీ రద్దుకే మొగ్గు..!
ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు చేస్తున్నా.. వెయిటేజీ రద్దుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను బట్టి వెయిటేజీ లెక్కించడం అనేది అశాస్త్రీయం అవుతుందన్న భావన ఉంది. బోర్డు ఎంసెట్ కన్వీనర్‌కు మార్కులను అందజేసినపుడు విద్యార్థుల మార్కులు బయటకొచ్చే ప్రమాదముంది. అలాకాకున్నా అభ్యర్థికి ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుతో సంతృప్తి చెందకపోతే ఇంటర్ మార్కుల కోసం లేదా జవాబు పత్రం కాపీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అలా కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థుల అన్ని సబ్జెక్టుల జవాబుపత్రాల కాపీల కోసం దరఖాస్తు చేసుకొని మార్కులను తెలుసుకునే అవకాశముంది.

ఇవీ మూడు ప్రతిపాదనలు..
  1. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్‌‌సడ్ పరీక్షల మాదిరిగానే ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించాలి. ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశాలు చేపట్టాలి.
  2. మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవాలి.
  3. గ్రేడ్లు ఇచ్చినా, బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారు కోసం విద్యార్థుల మార్కు లను ఎంసెట్ కన్వీనర్‌కు బోర్డు అందజేస్తే వెయిటేజీ లెక్కించి ఎంసెట్ ర్యాంకును ఖరారు చేయొచ్చు.
Published date : 15 Dec 2017 01:29PM

Photo Stories