‘ఎంసెట్’ ధ్రువపత్రాల పరిశీలనా ఆన్‌లైన్‌లోనే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనను కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటివరకు ఎంసెట్ రాసిన విద్యార్థులకు ర్యాంకుల ఆధారంగా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల అకడమిక్ అర్హతల ధ్రువపత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్ల పరిశీలన కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు వెళ్లి తమ ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకున్న తర్వాత.. ఆన్‌లైన్‌లో ఆయా కాలేజీలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారు. కానీ ఇప్పుడు ధ్రువపత్రాల పరిశీలనను కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.నరసింహారావు తెలిపారు. విద్యార్థులు తమ ధ్రువపత్రాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం.. ఆ ధ్రువపత్రాల సమాచారం సరైనదో కాదో వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారంతో క్రోడీకరించి ఉన్నత విద్యామండలి ధ్రువీకరించుకుంటుంది. అనంతరం మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
Published date : 24 Jan 2018 02:12PM