Skip to main content

ఎంసెట్-2 రద్దు చేయొద్దంటూ విద్యార్థుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్: ‘మెడిసిన్‌లో సీటు మా కల. అందుకోసం చిన్నప్పటి నుంచి అన్ని ఆనందాలు వదులుకుని చదువుకున్నాం.
తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్, ఎంసెట్-2 రాశాం. కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ అంటే అదీ రాశాం. ఎంసెట్-2లో మెరిట్ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో చేరుదామనుకుంటే.. లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతామంటే మా గతేం కావాలి. ఇప్పటికి 5 పరీక్షలు రాశాం. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్‌లు రాసే శక్తి మాకు లేదు.. ఎంసెట్-2 ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం వద్దకు వచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలను కలవాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం ప్రధాన గేటు ముందు ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై బైఠాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు. ఎంసెట్-2 రద్దు చేయొద్దని, దోషులను మాత్రమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాంకర్లకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

వారిని మళ్లీ పరీక్ష రాయనివ్వం: నాయిని
ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొందరిని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు నాయినికి విన్నవించుకున్నారు. లీకేజీకి కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని... 72 మంది కారణంగా వేలాది మంది విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరారు. దీనిపై స్పందించిన నాయిని.. ‘‘ఎంసెట్ పేపర్ లీకైనట్టు రుజువైంది. మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం ఒక్క ప్రశ్న లీకైనా మళ్లీ పరీక్ష నిర్వహించాలి. లీకైన పేపర్‌తో పరీక్ష రాసిన 72 మంది విద్యార్థులను మళ్లీ పరీక్ష రాయనివ్వం. మీరేం ఆందోళన చెందవద్దు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..’’ అని పేర్కొన్నారు.
Published date : 29 Jul 2016 02:35PM

Photo Stories