ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎంసెట్ కేంద్రాల ఏర్పాటు అసాధ్యం!
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడం కుదరదని, అక్కడి విద్యార్థులు కూడా తెలంగాణకే వచ్చి ఎంసెట్ రాయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు దీనిపై తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తదితరులు మంగళవారం సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రాల ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అయితే ఈనెల 9వ తేదీతో ఎంసెట్ దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త కేంద్రాల ఏర్పాటు అసాధ్యమని తేల్చారు. పైగా తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 25వ తేదీన జారీ చేసి, 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. విభజన చట్టం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలోని విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా తెలంగాణ ఎంసెట్ రాయవచ్చని, అయితే వారు తెలంగాణలోని కేంద్రాల్లో ఎంసెట్ రాయవచ్చని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల వెసలుబాటు కోసమే ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, నల్గొండ జిల్లాలోని కోదాడలో ఈసారి కొత్తగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది.
Published date : 08 Apr 2015 12:34PM