Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 21వరకు ఎంసెట్ దరఖాస్తుకు చివరి గడువు

సాక్షి,హైదరాబాద్/ కాకినాడ: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29వ తేదీన నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు తెలిపారు.
ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్ విభాగం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం వారికి పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అపరాధ రుసుం రూ. 500 చెల్లించి ఏప్రిల్ 2వ తేదీ వరకు, రూ. 1,000 చెల్లించి 11వ తేది వరకు, రూ. 5 వేలు చెల్లించి 19వ తేదీ వరకు, రూ. 10 వేల అపరాధ రుసుంతో 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేది వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్ నెంబర్‌ను తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్‌ను ఎంసెట్ ఈ-మెయిల్‌కు పంపించాలని, లేకుంటే హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోడానికి వీలుకాదని ఆయన తెలిపారు.

దరఖాస్తుల నమోదు..
ఎంసెట్ ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటి వరకు 2,55,212 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ సాయిబాబు తెలిపారు. బాలురు 1,29,698 మంది, బాలికలు 1,25,514 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,62,396 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో 90,908 మంది, రెండు విభాగాలకు గాను 954 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 1,36,306 మంది, ఉస్మానియా పరిధిలో 35,977 మంది, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలో 75,829 మంది, నాన్ లోకల్ కేటగిరీలో 7,100 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఏపీ ఎంసెట్-2016కు సంబంధించి సందేహాలను నివత్తి చేసుకునేందుకు 0884-2340535,0884-2356255 ఫోన్ నెంబర్ల ద్వారా గాని, ఈమెయిల్ ఐడి (apeamcet2k16@gmail.com) ద్వారా గాని సంప్రదించాలని కోరారు.

మెడికల్ అభ్యర్థులపై నిఘా..
గత మూడు ఏళ్ల నుంచి మెడికల్ విభాగంలో ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులపై నిఘా ఉంచినట్లు కన్వీనర్ తెలిపారు. ఆయా అభ్యర్థుల జాబితా తమ వద్ద ఉందని, వారు పరీక్షకు ఎందుకు హాజరవుతున్నారో కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. అటువంటి వారిపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. ఈ మేరకు కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పీఆర్‌ఓ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Published date : 21 Mar 2016 02:25PM

Photo Stories