EAMCET 2022: తొలి విడత సీట్ల కేటాయింపు
ఈ మేరకు Eamcet ప్రవేశాల కమిటీ కసరత్తు వేగవంతం చేసింది. సెప్టెంబర్ 6న రాత్రికల్లా సీట్ల కేటాయింపు వివరాలను EAMCET 2022 వెబ్ సైట్‌లో పొందుపర్చే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో1,11,147 సీట్ల భర్తీకి All India Council of Technical Education (AICTE) ఆమోదం తెలపగా.. ఇందులో 96 వేలకుపైగా సీట్ల భర్తీకి సంబంధిత యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 65,633 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఆగష్టు నెలలో నోటిఫికేషన్ వెలు వడింది. ఆగష్టు 21 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభంకాగా.. తొలి విడత ఆప్షన్ల ఎంపిక సెప్టెంబర్ 3న ముగిసింది. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 6న సీట్లను కేటాయింపును ఖరారు చేయనున్నారు. ఏవైనా అవాంతరాలు ఎదురైతే సెప్టెంబర్ 7 ఉదయానికల్లా తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వివిధ కాలేజీలు పలు కోర్సుల్లో దాదాపు 9 వేల అదనపు సీట్ల కోసం యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి ఆమోదం వస్తే.. అందులో కన్వీనర్ కోటా కిందకు వచ్చే సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.
భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు..
2022లో ఎంసెట్ ప్రవేశాలకు సంబంధించి కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు పెరిగాయి. ఇందుకు సంబంధించి హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐటీలో రూ.1.73 లక్షలకు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్‌ఐటీ మహిళా కాలేజీలలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో రూ.1.50 లక్షలు, ఎంవీఎస్‌ఆర్ రూ.1.45 లక్షలు చొప్పున ట్యూషన్ ఫీజులకు అనుమతి లభించింది. తాజాగా ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు పెరిగిన ఫీజు చెల్లించాల్సి వస్తుందని సమాచారం. అదే విధంగా ఎంసెట్‌లో పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. సెప్టెంబర్ 6న ఎంసెట్ మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయితే 13 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుంది. అయితే ఫీజు పెంపునకు సంబంధించి హైకోర్టు.. కాలేజీలకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఇచ్చింది. మొత్తం 79 కాలేజీలుండగా.. 36 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం ఉంది. కాగా, కాలేజీలు వసూలు చేసే పెంపు మొత్తాన్ని బ్యాంకుల్లోనే ఉంచాలని.. తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఫీజు పెంపు ఉత్తర్వులు ఉంటాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.