Skip to main content

27 వరకే ఎంసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్

సాక్షి, హైదరాబాద్/బాలాజీచెరువు (కాకినాడ): ఆంధ్రప్రదేశ్ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను ఈనెల27 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు తెలిపారు.
ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారితోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్, ఏపీఓఎస్‌ఎస్, టీఎస్‌ఓఓఎస్‌ఎస్, ఆర్‌జీయూకేటీల నుంచి ఇంటర్ చదివినవారికి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సమయంలో ప్రత్యేకంగా డిక్లరేషన్ ఫారం ఇస్తారని వివరించారు. దానిని పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలతో మార్కుల జాబితాను అటెస్టేషన్ చేయించి ఏపీ ఎంసెట్ కన్వీనర్ కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ఈ నెల 30 లోగా పంపించాలన్నారు. ఈ విధంగా పంపించిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులను ప్రకటిస్తామని చెప్పారు. రూ.10 వేలు అపరాధ రుసుంతో ఈ నెల27 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. వీరితో పాటు రూ.5 వేలు అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకున్న వారికి, మెడిసిన్‌లో పలుమార్లు పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు కాకినాడ రీజినల్ సెంటర్‌లో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఓఎంఆర్ షీట్‌లో కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నంబర్, కోడ్‌ను తప్పనిసరిగా పూరించాలని చెప్పారు. దరఖాస్తు ఫారంలో ఫొటోను అంటించి అటెస్టేషన్ చేయించాలని, పరీక్షా హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి వేలి ముద్ర కూడా వేయాలన్నారు. అభ్యర్థులు నామినల్ రోల్స్‌లో కూడా కేటగిరీ, జెండర్, సంతకం, వేలిముద్ర వేయాలని చెప్పారు. నలుపు లేదా నీలం పెన్నులలో ఏ పెన్నుతో పూరిస్తే అదే చివరి వరకు కొనసాగించాలని, పెన్నులు మధ్యలో మార్చకూడదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్‌ని ఈ నెల 29న పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షకు ప్రత్యేక పరిశీలకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను నియమించామన్నారు. వీరు ఈ నెల 28న సంబంధిత రీజనల్ కో ఆర్డినేటర్‌కు రిపోర్టు చేయాలని సాయిబాబు చెప్పారు.
Published date : 25 Apr 2016 02:18PM

Photo Stories