Skip to main content

2.51 లక్షలు దాటిన ఏపీ ఎంసెట్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనానంతరం తొలిసారిగా వేరుగా నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్‌కు అనూహ్యరీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అపరాధరుసుము లేకుండా చివరి తేదీ నాటికి 2,51,061 మంది దరఖాస్తు చేశారు. అపరాధ రుసుముతో గడువు ఇంకా ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ఇప్పటివరకు ఇంజనీరింగ్‌కు 1,66,901 మంది, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు 81,746 మంది, రెండింటికీ కలిపి 1,207 మంది దరఖాస్తులు అందజేశారు. వీరిలో బాలురు 1,34,596 మంది, బాలికలు 1,16,465 మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌కు బాలురు ఎక్కువ సంఖ్యలోను, మెడికల్ కోర్సులకు బాలికలు ఎక్కువ సంఖ్యలోను పోటీపడుతున్నారు. ఇంజనీరింగ్ దరఖాస్తుల్లో 1,03,490 మంది బాలురవి కాగా 63,411 బాలికలవి. అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులకు 29,788 మంది బాలురు దరఖాస్తు చేయగా 51,958 మంది బాలికలు దరఖాస్తులందించారు.

విజయవాడ, గుంటూరు, విశాఖ టాప్
రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఏపీ ఎంసెట్ నిర్వహణకోసం 22 రీజనల్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో ఎంసెట్‌కు పోటీపడుతున్నారు. విజయవాడ నుంచి 48,980, గుంటూరు 29,802, విశాఖపట్నం 24,003, కర్నూలు నుంచి 20,563 దరఖాస్తులు అందాయి. అతి స్వల్పంగా చిలకలూరిపేట నుంచి 152 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం నుంచి 12,147, అమలాపురం 3,622, అనకాపల్లి 1,476, భీమవరం 5,958, చిత్తూరు 4,062, ఏలూరు 10,187, కడప 8,691, కాకినాడ 16,363, మచిలీపట్నం 3,444, నంద్యాల 2,535, నరసారావుపేట 1,888, నెల్లూరు 14,616, ఒంగోలు 11,580, ప్రొద్దుటూరు 1,684, శ్రీకాకుళం 7,003, తిరుపతి 16,852, విజయనగరం నుంచి 5,453 దరఖాస్తులు అందాయి.

హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలు
తెలంగాణ ప్రాంతం నుంచి 25 వేల మందికి పైగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసినందున వారికోసం హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 106 కేంద్రాల కోసం ఉన్నత విద్యామండలి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో 40 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు సహకారాన్ని అందించేందుకు ఆ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని మండలి వర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించి ఆ ప్రభుత్వం నుంచి అనుమతిపత్రం వచ్చిన వెంటనే కేంద్రాల ఏర్పాటును అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపాయి.

తెలంగాణ నుంచి 25,599 మంది
ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ నుంచి 25,599 మంది దరఖాస్తు చేశారు. ఏపీ ఎంసెట్‌ను 13 జిల్లాల ఏపీకే పరిమితమై నిర్వహిస్తున్నా ‘స్థానిక అభ్యర్థిత్వాన్ని’ ఉమ్మడి రాష్ట్రం మాదిరిగానే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారీగా లెక్కిస్తుండడం విశేషం. ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, ఉస్మానియా వర్సిటీల పరిధిలోని అభ్యర్థులు తమ వర్సిటీ పరిధిలో స్థానికులుగా, ఇతర వర్సిటీల పరిధిలో స్థానికేతరులవుతారు. స్థానిక కోటా కింద 85 శాతం సీట్లు, స్థానికేతర కోటా కింద 15 శాతం సీట్లు కేటాయిస్తారు. ఏపీ ఎంసెట్‌లో తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీని కూడా ఒక ప్రాంతంగా చేర్చి 15 శాతం కోటా అమలుకు చర్యలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసి ఉంటే వారిని స్థానికేతరులుగా గుర్తించారు.

ఫీజు రీయింబర్స్‌మెంటుపైనే ఆశ
ఎక్కువగా ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఆశలు పెట్టుకుని అధికసంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు కనిపిస్తోంది. 2.51 లక్షల మందిలో లక్షమందివరకే అగ్రవర్ణ కులాల వారుండగా తక్కిన వారంతా ఫీజు రీయింబర్స్‌మెంటుకు అర్హులైన రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన సామాజికవర్గాల వారే ఉన్నారు. ఇందులో 50 వేల వరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు. అయితే ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంటుపైనే ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. ఇప్పుడు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

సామాజికవర్గాల వారీగా అభ్యర్ధులు

కేటగిరీ

ఇంజనీరింగ్

అగ్రి , మెడికల్

రెండూ

మొత్తం

ఓసీ

75472

24009

996

100477

బీసీ

69961

35249

898

106108

ఎస్సీ

17815

17070

426

35311

ఎస్టీ

3653

5418

94

9165



ప్రాంతాల వారీగా దరఖాస్తుల వివరాలు

యూనివర్సిటీ

ఇంజనీరింగ్

అగ్రి , మెడికల్

రెండూ

మొత్తం

ఆంధ్రా

1,04,582

36,326

647

1,42,202

శ్రీవేంకటేశ్వర

49,737

25,715

254

75,960

ఉస్మానియా

8,494

16,907

99

25,599

నాన్‌లోకల్

4,088

2,798

207

7,300

మొత్తం

1,66,901

81,746

1,207

2,51,061

Published date : 14 Apr 2015 02:42PM

Photo Stories