22 నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 22వ తేదీ నుంచే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అనుగుణంగా జేఎన్టీయూహెచ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. విజిలెన్స్ విభాగం తనిఖీలు పూర్తి చేసి జేఎన్టీయూహెచ్ నివేదికలతో సరిపోల్చి అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని, నెలాఖరులో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇక మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్ ద్వారా చేపట్టే అంశంపై వారం తర్వాత మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు తెలిసింది.
Published date : 10 Jun 2016 02:09PM