Skip to main content

2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుదారుల సంఖ్య గతేడాది కంటే పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 1,97,604 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సంఖ్య శనివారం ఉదయం కల్లా 2 లక్షలు దాటుతుందని అధికారులు పేర్కొన్నారు. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 28తో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో 40 వేల మంది దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అం చనా వేస్తున్నారు. ఏపీలోని 4 ప్రాంతాల్లో ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రా సే విద్యార్థుల సంఖ్య పెరగనుంది.

మెడికల్‌కు పెరగనున్న దరఖాస్తులు
ఇంజనీరింగ్‌తో సమానంగా అగ్రికల్చర్, మెడికల్‌కు దర ఖాస్తులు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.గతేడాది ఇంజనీరింగ్ కోసం 1,39,677 మంది దరఖాస్తు చేసుకోగా 2016 ఎంసెట్ కోసం శుక్రవారం వరకు 1,12,568 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అగ్రికల్చర్, మెడికల్ కోసం 92,368 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 83,402 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మూడు రోజుల్లో గతేడాది కన్నా ఈ సంఖ్య మించనుంది. రూ.500 ఆలస్య రుసుంతో వచ్చే నెల 3 వరకు, రూ.1000తో వచ్చే నెల 13 వరకు, రూ.5 వేలతో వచ్చే నెల 22 వరకు, రూ.10 వేలతో వచ్చే నెల 29 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది.

ఏపీ నుంచి మెడికల్‌కే ఎక్కువ..
తెలంగాణ ఎంసెట్‌కు ఏపీ నుంచి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు పేర్కొన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్, మెడికల్ దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి 23,770 మంది దరఖాస్తు చేసుకోగా అందులో అగ్రికల్చర్, మెడికల్ కోసం 15,198 దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ కోసం 8,444 మంది దరఖాస్తు చేశారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధి నుంచి 15,609 మంది దరఖాస్తు చేసుకోగా అందులో అగ్రికల్చర్, మెడికల్ కోసం 11,341 మంది దరఖాస్తు చేశారు.
Published date : 26 Mar 2016 01:47PM

Photo Stories