17 వరకు ఎంసెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణ
Sakshi Education
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు(కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్-2017కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఈనెల 17 వరకు గడువుందని ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబా తెలిపారు.
దరఖాస్తు ఫారంలోని తప్పులను సరిదిద్దడానికి సంబంధిత ధ్రువపత్రాలను జతపరుస్తూ onlineapeamcet2017@gmail.comకు మెయిల్ పంపించాలని సూచించారు. ఈ మేరకు ఈనెల 15న ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఎంసెట్‌కు రూ. 5 వేల అపరాధ రుసుముతో ఈనెల 17 వరకు, రూ. 10 వేల రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. స్క్రయిబ్ కావాలనుకొనే అభ్యర్థులు ఎవరి సహాయంతో పరీక్షకు హాజరవుతారో ఆ అభ్యర్థిని ఎంసెట్ కార్యాలయానికి తీసుకువచ్చి అనుమతి పొందాలని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్షను ఈనెల 24, 25, 26 తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 28న నిర్వహిస్తామన్నారు. ఉర్దూ అనువాదం కావాలనుకొనే వారికి కర్నూలులో మాత్రమే పరీక్ష కేంద్రం కేటాయిస్తామని చెప్పారు. పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీని, సమయాన్ని విద్యార్థులకు హాల్‌టికెట్లో తెలియచేస్తామన్నారు. కాగా ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదని తెలిపారు. సందేహాల నివృత్తికి 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.
Published date : 17 Apr 2017 02:49PM