Skip to main content

15న ఎంసెట్-3ర్యాంకులు!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్-3 ర్యాంకులను ఈనెల 15వ తేదీన విడుదల చేసేందుకు ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది.
ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 16వ తేదీన ర్యాంకులను విడుదల చేయాలని అనుకున్నా.. ప్రవేశాలు ఆలస్యం కాకుండా ఓ రోజు ముందే ఫలితాలు విడుదల చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కమిటీ విడుదల చేసిన రాత పరీక్ష ప్రాథమిక కీపై ఈనెల 14వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కాగా, ఎంసెట్-3లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 17 నుంచి 20వ తేదీ వరకు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్ టీయూలో, ఉస్మానియా యూనివర్సిటీలో, ట్యాంక్‌బండ్ సమీపంలోని ఏవీవీ కళాశాలలో, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీలో, విజయవాడలోని ఎన్ టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వివరాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.com ను సంప్రదించాలని ఆయన కోరారు.
Published date : 13 Sep 2016 01:06PM

Photo Stories