Skip to main content

Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో రుద్రాంక్ష్‌కు స్వ‌ర్ణం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది.
Rudrankksh Patil

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ బాలాసాహెబ్‌ పాటిల్‌ పసిడి పతకం సాధించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ సేన్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో రుద్రాంక్ష్ 16–8తో మాక్సిమిలన్‌ ఉల్‌బ్రిచ్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో రుద్రాంక్ష్ 262 పాయింట్లు, ఉల్‌బ్రిచ్‌ 260.6 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. మిరాన్‌ మారిసిచ్ (క్రొయేషియా; 260.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు.

74 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 629.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ రౌండ్‌కు చేరాడు. టాప్‌–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్‌ రౌండ్‌లో పోటీపడతారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో తిలోత్తమ సేన్‌ 262 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)

Published date : 22 Feb 2023 03:00PM

Photo Stories