World Athletics Championships 2022 : నీరజ్ చోప్రాకి రజతం
జూలై 24న జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగా... జాకుబ్ వాద్‌లెచ్ (చెక్ రిపబ్లిక్) జావెలిన్‌ను 88.09 మీటర్ల దూరం పంపించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
Also read: UNPD: 2100 నాటికి 41 కోట్లు తగ్గిపోనున్న భారత్ జనాభా
తొలి ప్రయత్నంలో విఫలమైనా...
జావెలిన్ త్రో ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్‌ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశకు చేరగా... మిగతా నలుగురు నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే అర్హత ప్రమాణాన్ని అందుకున్న 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో మాత్రం తొలి అవకాశంలో ఫౌల్ చేశాడు. అయితే ఆందోళన చెందకుండా నీరజ్ నెమ్మదిగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరిన నీరజ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో నీరజ్ తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. నీరజ్ ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ కాగా... 24 ఏళ్ల అండర్సన్ పీటర్స్ చివరిదైన ఆరో ప్రయత్నంలో ఈటెను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
Also read: World Athletics Championships: అథ్లెట్ సిడ్నీ మెక్‌లాఫ్లిన్ ప్రపంచ రికార్డు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP