FIH అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా
గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. జూలై 18న కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది.
Also read: World Cup Shooting Tournament: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ - స్కిట్ లో భారత్‌కు తొలి స్వర్ణం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP