Skip to main content

Asian Games Equestrian: ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు స్వర్ణం

ఎవరూ ఊహించని విధంగా ఈక్వెస్ట్రియన్‌ క్రీడాంశంలో భారత బృందం మెరిసింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మళ్లీ స్వర్ణ పతకం లభించింది.
Asian Games Equestrian, Gold medal-winning Indian equestrian team, Historical movement
Asian Games Equestrian

మంగళవారం జరిగిన డ్రెసాజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో విపుల్‌ హృదయ్‌ చడ్డా, అనూష్‌ అగర్‌వల్లా, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత జట్టు 209.205 పాయింట్లు సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. చైనా (204.882 పాయింట్లు) రజతం, హాంకాంగ్‌ (204.852 పాయింట్లు) కాంస్య పతకం గెల్చుకున్నాయి.

Asian Games Rifle: రైఫిల్‌లో భారత్‌కు రజతం

ఇంటికి దూరంగా.. 

ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. ఈ స్వర్ణ పతకం వెనుక భారత రైడర్ల శ్రమ ఎంతో దాగి ఉంది. విపుల్, అనూష్, దివ్యాకృతి, సుదీప్తి కొన్నేళ్ల క్రితం భారత్‌ నుంచి యూరోప్‌కు వెళ్లి కుటుంబసభ్యులకు దూరంగా నివసిస్తూ అక్కడే శిక్షణ తీసుకుంటున్నారు. ఆసియా క్రీడల కోసం భారత ఈక్వెస్ట్రియన్‌ సమాఖ్య వీరి కోసం యూరోప్‌లోనే ట్రయల్స్‌ కూడా నిర్వహించింది.

ఈ నలుగురి అశ్వాలను జర్మనీలో ఏడురోజులపాటు క్వారంటైన్‌లో పెట్టాక ఈనెల 21న చైనాకు తరలించారు. ‘ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడం నమ్మశక్యంగా లేదు. ఇక్కడి దాకా మా అందరి ప్రయాణం ఎంతో కఠినంగా సాగింది. యుక్త వయసులోనే మేమందరం యూరోప్‌కు వచ్చి శిక్షణ తీసుకుంటున్నాం’ అని ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల సుదీప్తి వ్యాఖ్యానించింది. ‘మేమందరం ఒకరినొకరం ఉత్సాహపరుచుకున్నాం. జాతీయ గీతం వినిపిస్తూ, జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే ఆ అనుభూతిని వర్ణించలేం.

మా అందరి శ్రమకు తగ్గ ఫలితం స్వర్ణం రూపంలో లభించింది’ అని 2017లో యూరోప్‌ వెళ్లిన కోల్‌కతాకు చెందిన 23 ఏళ్ల అనూష్‌ తెలిపాడు. జైపూర్‌కు చెందిన దివ్యాకృతి అజ్మీర్‌లోని విఖ్యాత మాయో గర్ల్స్‌ స్కూల్‌లో ఏడో తరగతిలో ఉన్నపుడు హార్స్‌ రైడింగ్‌పై దృష్టి సారించింది. 2020లో యూరోప్‌కు వెళ్లిన దివ్యాకృతి జర్మనీలో శిక్షణ తీసుకుంది. ముంబైకి చెందిన 25 ఏళ్ల విపుల్‌ గత పదేళ్లుగా యూరోప్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. లండన్‌ యూనివర్సిటీ నుంచి అతను బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ పూర్తి చేశాడు.

Asian Games sailing: సెయిలింగ్‌లో భార‌త్‌కు రజిత, కాంస్య ప‌త‌కాలు

డ్రెసాజ్‌ అంటే.. 

ఈక్వెస్ట్రియన్‌లో ఎండ్యూరన్స్, ఈవెంటింగ్, జంపింగ్, పెగ్గింగ్, డ్రెసాజ్‌ తదితర ఈవెంట్లు ఉంటాయి. డ్రెసాజ్‌ అనేది ఫ్రెంచ్‌ పదం. ఆంగ్లంలో దీని అర్ధం ట్రెయినింగ్‌. తన అశ్వానికి రైడర్‌ ఏ విధంగా శిక్షణ ఇచ్చాడో, వీరిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉందో ఈ ఈవెంట్‌ ద్వారా తెలుస్తుంది. రైడర్‌ నుంచి వచ్చే సంజ్ఞల ఆధారంగా అశ్వం కనబరిచే పలు కదలికలను జడ్జిలు పరిశీలిస్తారు. అనంతరం సున్నా నుంచి పది మధ్య పాయింట్లు ఇస్తారు. గరిష్టంగా పాయింట్లు సాధించిన జట్టుకు పతకాలు ఖరారవుతాయి. జట్టులో నలుగురు రైడర్లు ఉన్నా.. పతకాలు ఖరారు చేసేందుకు టాప్‌–3 రైడర్ల పాయింట్లను లెక్కలోకి తీసుకుంటారు.

Asian Games 2023: భారత యువ షూటర్ల‌కు స్య‌ర్ణం

Published date : 28 Sep 2023 11:07AM

Photo Stories