Skip to main content

Dubai Open Chess: దుబాయ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో మెరిసిన భారత గ్రాండ్‌మాస్టర్లు

దుబాయ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు అరవింద్‌ చిదంబరం, ఇరిగేశి అర్జున్‌ మెరిశారు.
Arjun Erigaisi

జూన్ 4న‌ ముగిసిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల అరవింద్‌ వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలువగా.. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అరవింద్, జవోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), అర్జున్, మాక్సిమ్‌ మత్లకోవ్‌ (రష్యా) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. అరవింద్‌కు టైటిల్‌ ఖరారు అయింది. సిందరోవ్‌ తొలి రన్నరప్‌గా, అర్జున్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ టోర్నీలో అరవింద్, అర్జున్‌ అజేయంగా నిలిచారు.
ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. అరవింద్, అర్జున్‌లిద్దరు చెరో నాలుగు గేముల్లో గెలిచి, మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. చాంపియన్‌ అరవింద్‌కు 12 వేల డాలర్లు (రూ. 9 లక్షల 88 వేలు), సిందరోవ్‌కు 8 వేల డాలర్లు, అర్జున్‌కు 6 వేల డాలర్లు (రూ. 4 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే టోర్నీలో ఆడిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కార్తీక్‌ వెంకటరామన్‌ 12వ ర్యాంక్‌లో, లలిత్‌ బాబు 18వ ర్యాంక్‌లో.. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు రాజా రిత్విక్‌ 58వ ర్యాంక్‌లో, హర్ష భరతకోటి 61వ ర్యాంక్‌లో నిలిచారు.

BWF World Rankings: బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌కు నాలుగో ర్యాంక్
 

Published date : 05 Jun 2023 06:42PM

Photo Stories