World Malaria Day: మలేరియా లేని ప్రపంచం కోసం...
చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్ 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. దీనిని ‘ప్లాస్మోడియం’ జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్ అనే ఐదు రకాల పరాన్నజీవుల వలన మానవులకు మలేరియా సోకుతోంది. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి ఒకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ద్ధరించారు. ఇందుకుగానూ ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ‘అనాఫిలస్’ జాతికి చెందిన ఆడ దోమల వలన మలేరియా వ్యాధికారక క్రిమి వ్యాప్తి చెందుతుంది.
మలేరియా వ్యాధి తీవ్రతను అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో ‘‘ఆఫ్రికా మలేరియా డే’’ ఆచరించింది. అదే స్ఫూర్తితో 2008 నుండి ఏప్రిల్ 25ను ‘వరల్డ్ మలేరియా డే’గా ఆచరిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల 10 లక్షల మంది మలేరియా వ్యాధి బారినపడగా, 6 లక్షల 27 వేల మంది చనిపోయారు.
also read: Solar Energy – The Emerging Power Opportunity
ఇక మనదేశం విషయానికివస్తే 2021లో అధికారికంగా 1,58,326 మలేరియా కేసులు గుర్తించగా, 80 మరణాలు సంభవించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స, నియంత్రణల్లో కనుగొన్న నూతన ఆవిష్కరణల ఫలితంగా గత 10 సంవత్సరాల్లో మలేరియా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలు, దీర్ఘకాలం వినియోగించ గలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాల వలన ఇది సాధ్యమైంది. దీన్ని సాధించడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు చేసిన కృషి ఎనలేనిది. 2030 నాటికి భారత దేశం నుండి మలేరియా వ్యాధిని పూర్తిగా తొలగించడానికి పథక రచన చేశారు.
– తలతోటి రత్న జోసఫ్,
రిటైర్డ్ ఏడీ; ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ
(నేడు ప్రపంచ మలేరియా డే)