Shukrayaan-I: శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనున్న దేశం?
Sakshi Education
చంద్రుడు, కుజుడి(మార్స్)పైకి విజయవంతంగా వ్యోమ నౌకలను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. 2024 డిసెంబరులో శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనుంది. సౌర కుటుంబంలోకెల్లా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలకు నెలవైన శుక్రుని కక్ష్యలో తమ నౌక పరిభ్రమిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వివరించారు. ‘శుక్ర గ్రహ సైన్స్’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘శుక్రునిపై ఎల్లప్పుడూ దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు అలుముకుని ఉంటాయి. ఆ మేఘాల కింద శుక్రుని ఉపరితలాన్ని తమ నౌక కక్ష్య నుంచే శోధిస్తుంది’ అని చెప్పారు. 2024 డిసెంబరులో శుక్రుని చేరుకునే ఇస్రో వ్యోమ నౌక.. 2025 జనవరి నుంచి శుక్ర కక్ష్యలో విన్యాసాలు పారంభిస్తుంది. 2025లో భూమి, శుక్రుడు ఒకే రేఖ మీదకు ఉంటాయి కాబట్టి, రెండు గ్రహాల మధ్య దూరం తగ్గుతుందని సోమనాథ్ వివరించారు.
Published date : 10 May 2022 06:47PM