Skip to main content

Earth Mantle: తొలిసారి చేజిక్కిన భూ ప్రవార శిల.. భూమి రెండో పొర నుంచి రాళ్ల నమూనా!

బ్రిటన్‌ భూ భౌతిక శాస్త్రవేత్తలు భూమి రెండో పొర అయిన మ్యాంటల్‌ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించారు.
Scientists Obtain Deepest Rock Sample from Earth Mantle

అట్లాంటిక్‌ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు. భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే.

భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్‌ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్‌ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్‌ రిజల్యూషన్‌ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. 

అతి పెద్ద ముందడుగు.. 
భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్‌ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్‌ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. 

Surgeon Performs: 5,000 కిలోమీటర్ల దూరం నుంచి శస్త్రచికిత్స!

భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. 

సేకరణ అంత ఈజీ కాదు..
భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్‌ అట్లాంటిక్‌ రిడ్జ్‌కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్‌ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 

2024 ఏప్రిల్‌ నుంచి జోయిడిస్‌ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్‌ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్‌ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్‌ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్‌ లీసెన్‌బర్గ్‌ చెప్పారు.

ISRO-NASA Mission to ISS: అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న భారతీయలు వీరే..

Published date : 13 Aug 2024 10:08AM

Photo Stories