Skip to main content

Artificial Intelligence: ఇక‌ వైద్యమంతా ఏఐమయమే.. కృత్రిమ మేధతో ఉపయోగాలెన్నో..!

మనిషి మెదడు, కృత్రిమ మేధ రెండింట్లో ఏది గొప్ప అన్న చర్చ ఇప్పటిది కాదు. ఏఐ చాట్‌బాట్ల రాకతో ఇది మరింత ఊపందుకుంది.
Artificial Intelligence

ఏఐ వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావనేది ఒక వాదన. దీనివల ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే గాక తప్పుడు సమాచారం మొదలుకుని ప్రాణహాని దాకా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చనే వాదన మరొకటి. వెనకాముందూ చూసుకోని పక్షంలో అంతిమంగా కృత్రిమ మేధ మానవాళిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుందని భయపడేవాళ్లూ ఉన్నారు. ఈ చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండా ఏఐ ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా చొచ్చుకొస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. మున్ముందు దీని పరిణామాలెలా ఉంటాయన్నది ఆసక్తికరం.

ఇప్పటికే వినియోగంలో..
ఏ కంప్యూటరో, మరోటో తనకిచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని, పూర్తిగా విశ్లేషించి అచ్చం మనిషి మాదిరిగా ప్రతిస్పందించగలగడమే కృత్రిమ మేధ అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం ఈనాటిది కాదు. గుండె పరీక్షల్లో మొదటిదైన ఈసీజీ మొదలుకుని అల్ట్రా సౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరికరాల్లో ఏఐ వాడకం ఏళ్లుగా ఉన్నదే. వీటిల్లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి రిపోర్టు జనరేట్‌ చేసేది ఏఐ సాయంతోనే.

UAE: స్పేస్‌ వాక్‌ నిర్వహించిన తొలి అరబ్‌ వ్యోమగామి

కంటిలోని రెటీనా ఫొటోలను చూసి సమస్యను పసిగట్టడంలో ఏఐ ఇప్పటికే కంటి డాక్టర్లతో పోటీపడుతోంది. రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యాంజియోగ్రాం తదితర అతి సంక్లిష్టమైన వైద్య వీడియోలను కూడా సమగ్రంగా చక్కని చికిత్స మార్గాలను సూచించే దిశగా దూసుకుపోతోంది ఏఐ! మెదడులోని న్యూరాన్ల ఆధారంగా కనిపెట్టిన డీప్‌ లెర్నింగ్‌ కాన్సెప్టు ఏఐలో అత్యంత కీలకం. ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడంతో సరిపెట్టకుండా తన దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో క్రోడీకరించి, విశ్లేషించి, మరింత మెరుగైన, సమగ్రమైన ఫలితాలు వెల్లడించడం దీని ప్రత్యేకత.

ఎన్నో ఉపయోగాలు..
► వైద్యులు–రోగి సంభాషణను, పరీక్ష ఫలితాలను బట్టి కచ్చితమైన రోగ నిర్ధారణ చాట్‌ జీసీటీ ఫోర్‌ వంటి చాట్‌బాట్లతో ఇప్పటికే సాధ్యపడుతోంది.
► మెడికల్‌ రికార్డుల నిర్వహణలో ఏఐ బాగా ఉపయోగపడనుంది. తద్వారా డాక్టర్లకు ఎంతో సమయం ఆదా చేయడమేగాక రోగి సమాచారాన్నంతా లోతుగా విశ్లేషించి సమగ్రమైన డిశ్చార్జ్‌ సమ్మరీని అలవోకగా అందిస్తుంది.
► డిశ్చార్జ్‌ సమయంలో ఇచ్చే ట్రీట్మెంట్‌ చార్ట్‌లోని మందులను గుర్తించి, వాటి సైడ్‌ ఎఫెక్టులు తదితరాలను రోగికి స్పష్టంగా చెబుతుంది. డ్రగ్స్‌ తాలూకు నెగెటివ్‌ ఇంటరాక్షన్‌పై అలర్ట్‌ చేయగలుగుతుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
► ఇన్సూరెన్స్‌ పేపర్లను సరిగా విశ్లేషించి క్లెయిం సులువుగా, త్వరగా జరిగేలా చూస్తుంది. మెడికల్‌ డిసీజ్‌ కోడింగ్‌లోనూ బాగా ఉపయోగపడుతుంది.
► వైద్య విద్యలోనైతే ఏఐ విప్లవాన్నే తేనుంది! సంక్లిష్టమైన అంశాలను బొమ్మలు, టేబుల్స్‌లా, చార్టుల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటంలో, మెడికల్‌ రీసర్చ్‌లో కీలక పాత్ర పోషించనుంది.
► రోబోటిక్‌ పరికరాలతో మమేకమై సంక్లిష్టమైన ఆపరేషన్లలో వైద్యులకు సహకరించనుంది.
► కోవిడ్‌ వంటి మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడొచ్చు.
► టెలీ మెడిసిన్‌నూ ఏఐ కొత్త పుంతలు తొక్కించగలదు. రోగి ఆస్పత్రికి వచ్చే పని లేకుండానే సమస్య గుర్తింపు, వైద్యం, పర్యవేక్షణ జరిగిపోతాయి.
► కొత్త మందులను కనిపెట్టడం మొదలుకుని జన్యు అధ్యయనం ద్వారా ప్రతి వ్యక్తికీ పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ సూచించగలదు.

First Baby With DNA: ముగ్గురి డీఎన్‌ఏతో జన్మించిన శిశువు.. అరుదైన ప్రయోగం విజయవంతం

సమస్యలూ తక్కువేమీ కాదు..
► ఆరోగ్య సమాచారం తాలూకు గోప్యత చాలా కీలకం. ఏఐతో దీనికి చాలా ముప్పుంటుంది.
► ఏఐ సలహాలు అన్నివేళలా కరెక్టుగా కాకపోవచ్చు. కొన్ని రకాల వైద్య సలహాలివ్వడంలో చాట్‌జీపీటీ వంటివి చిత్త భ్రాంతికి గురైనట్టు ఇప్పటికే తేలింది. అలాగని వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వస్తే వైద్యులకు అదో అదనపు బరువుగా మారొచ్చు.
► డ్యూటీ డాక్టర్ల పనులను ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. కనుక మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ వంటి హెచ్చు నైపు ణ్యం అక్కర్లేని ఉపాధి అవకాశాలకైతే ఏఐ సమీప భవిష్యత్తులోనే పూర్తిగా గండి కొట్టవచ్చు.
► ప్రజారోగ్యానికి సంబంధించిన విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తే వాటిలో వ్యక్తి స్వేచ్ఛ వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోవచ్చు.

చివరగా..
ఆరోగ్య రంగంపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్‌ జనరల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఓ కొత్త జర్నల్‌నే ప్రారంభించనుంది. ఇరువైపులా పదునున్న కత్తి వంటి ఏఐని విచక్షణతో వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అంతిమంగా మనదే.

India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే..

Published date : 13 May 2023 08:34AM

Photo Stories