Megha Trophiques-1: శాటిలైట్‌ను సముద్రంలో కూల్చేసిన ఇస్రో!
భూ కక్ష్యలోకి ప్రవేశించిన ఎంటీ–1ను నిర్దేశిత పసిఫిక్ సముద్రంలోని నిర్జన ప్రదేశంలో కూల్చేసింది. వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం 2011లో పీఎస్‌ఎల్‌వీ–సి18 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ వెయ్యి కిలోల బరువైన ఉపగ్రహం 2021 నుంచి పనిచేయడం మానేసింది. అందులో మిగిలిపోయిన సుమారు 125 కిలోల ఇంధనంతో పేలుడు సంభవించి, ఇతర శాటిలైట్లకు ముప్పు వాటిల్లుతుందని ఇస్రో అంచనా వేసింది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ ఉపగ్రహాన్ని తిరిగి కక్ష్య వెలుపలికి తీసుకురావాలనే క్లిష్టమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
నియంత్రిత పునరాగమనం పద్ధతిలో చేపట్టిన ఈ సరికొత్త ప్రయోగం కోసం ఎంటీ–1లోని ఇంధనాన్నే ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శాటిలైట్‌ను క్షక్ష్య వెలుపలి నుంచి తక్కువ ఎత్తులోకి తీసుకువచ్చి, లక్షిత ప్రాంతంలో నష్టం కనిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాము చేపట్టిన కార్యక్రమం మార్చి 7వ తేదీ పూర్తిస్థాయిలో విజయవంతమైందని బెంగళూరులోని ఇస్రో కేంద్ర కార్యాలయం ట్వీట్ చేసింది. సాధారణంగా, భారీ ఉపగ్రహాలు లేదా రాకెట్లు భూ కక్ష్యలోకి వచ్చాక మండిపోతాయి. దీనివల్ల చిన్న శకలాలు భూమిపై పడితే పెద్దగా నష్టం వాటిల్లేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రవేశపెట్టే శాటిలైట్లను నియంత్రిత పునరాగమనానికి వీలుగానే తయారు చేస్తున్నారని, ఎంటీ–1లో మాత్రం అలాంటి వెసులుబాటు లేదని ఇస్రో తెలిపింది.