Sunita Williams: సునీతా విలియమ్స్.. మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే!
Sakshi Education
అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్‌మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వారు కచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5వ తేదీ సునీత, విల్‌మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్‌మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది.
Published date : 02 Jul 2024 10:27AM