Skip to main content

‘ఏపీలో రూ.65 కోట్లతో లెదర్‌ పరిశ్రమాభివృద్ధి’

లిడ్ క్యాప్ ప్రగతికి కార్యాచరణ పథకం మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
development leather industry
development leather industry

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో లెదర్‌ పరిశ్రమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లెదర్‌ పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. 

రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్ క్యాప్) కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్ గేట్‌లో లిడ్ క్యాప్ కు అత్యంత విలువైన భూమి ఉందని చెప్పారు. ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లాలోని వెన్నెలవలస, పార్వతీపురం జిల్లాలోని అద్దపుశీల, ఏలూరు జిల్లాలోని నూజివీడు, పల్నాడు జిల్లాలోని అడిగొప్పుల, ప్రకాశం జిల్లాలోని యడవల్లి, అనంతపురం జిల్లాలోని రాచపల్లి, రాళ్ల అనంతపురం, కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, తిరుపతి జిల్లా కేంద్రాల్లో మొత్తం 133.74 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు.

ఈ భూముల్లో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయన్నారు. వీటిలో భవనాలతో పాటుగా శిక్షణలకు ఉపయోగపడే షెడ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. 

పీఎం అజయ్ పథకం కింద ఇదివరకు మంజూరైన రూ.11.50 కోట్ల నిధులతో కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిలలో రెండు పాదరక్షల తయారీ (ఫుట్ వేర్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్) కేంద్రాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని నాగార్జున వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ గేట్ లో ఉన్న భూమిలో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన ఒక పెద్ద భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్ పార్క్ లను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదికాకుండా రూ.65 కోట్లతో లిడ్ క్యాప్ లో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, దీనిలో భాగంగానే  పాదరక్షల కు సంబంధించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.10 కోట్లతోనూ, చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణల కోసం మరో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.30 కోట్లతోనూ, కొత్త భవనాల నిర్మాణాలను రూ.15 కోట్లతోనూ, ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధిని రూ.10 కోట్లతోనూ చేపట్టనున్నామని మంత్రి వివరించారు.

అలాగే లిడ్ క్యాప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉన్న ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమాభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమీక్షా సమావేశానికి రావాలని లిడ్ క్యాప్ అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి, ఫెలో శ్యామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Published date : 16 May 2023 03:12PM

Photo Stories