Skip to main content

ISRO : సూర్యుడిపై ఇస్రో క‌న్ను.. ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం కోసం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Aditya L1 First Indian mission to study the Sun

2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కోవిడ్‌ వల్ల ఆలస్యమైంది.ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ మీడియాకు వెల్లడించారు.

మరో ఘనత..
బెంగళూరులోని యు.ఆర్‌.రావు స్పేస్‌ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌–1, చంద్రయాన్‌–2, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్‌యాన్‌–1 అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.

దీని ప్ర‌త్యేక‌త‌లు..

ISRO


ఈ ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో పేలోడ్స్‌ బరువు 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలుంటుంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1(ఎల్‌–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ అమర్చి పంపిస్తున్నారు.

సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలో­మీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్‌ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్‌ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆది­త్య–ఎల్‌1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్‌ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతు­న్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Published date : 22 Aug 2022 01:08PM

Photo Stories