Telangana Reservations : గిరిజనులకు 10% రిజర్వేషన్ కోటా.. ఉత్తర్వులు జారీ..
ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇచ్చిన హామీ మేరకే..
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ‘గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా వారం రోజుల్లో జీవో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం.
ఏడేళ్లు గడిచినా
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఏడేళ్లు గడిచినా రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడాన్ని ఈ సభలో సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో జారీ చేసుకుంటామన్నారు. సీఎం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసింది. తమిళనాడులో 28 ఏళ్లుగా 69 శాతం రిజర్వేషన్లు అమలవుతుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిపదికగా జీవోలో చూపింది.
అగ్రకుల పేదలకు..
రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మొత్తం రిజర్వేషన్లు 70 శాతానికి పెరిగాయి. అగ్రకుల పేదల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ గతేడాది మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 65 జారీ చేయడంతో అప్పట్లో మొత్తం రిజర్వేషన్ల శాతం 66 శాతానికి పెరిగింది. తాజాగా ఎస్టీ కోటాను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో 70 శాతానికి చేరింది.